ఊరట స్వల్పమే
టిడిఎస్ పన్ను చెల్లింపుదారులకు పెద్దగా లాభం లేదంటున్న నిపుణులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. లాక్ డౌన్ విధింపులు తప్పనిసరి కావడంతో అన్నీ స్తంభించిపోయాయి. వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది.
ఉపాధి కోల్పోవడం వల్ల చాలామందికి పూట గడవటం ప్రశ్నార్థకంగా మారింది. కనుక వినిమయం దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధికి ఊతం ఇవ్వడమే ధ్యేయంగా, స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తన ప్రకటనకు ముందు నిర్మలా సీతారామన్ చెప్పారు.
కనుక ఆమె ప్రకటించిన తొలి విడత చర్యలు ఈ దిశగా వుంటాయని సహజంగానే ఆశిస్తారు. టీడీఎస్, టీసీఎస్ తగ్గింపు మూలాన వీరి పన్ను చెల్లింపులో మాత్రం తగ్గింపు ఉండదని నిపుణులు చెప్తున్నారు.
ఐటీ శ్లాబులను అనుసరించి వీరు మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన మేరకు వీరికి తాత్కాలికంగా ఉపశమనమే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అంటున్నారు.
అయితే వడ్డీ, డివిడెండ్, అద్దె వంటి వేతనేతర చెల్లింపులకు సంబంధించి టీడీఎస్/టీసీఎస్ ను కేంద్ర ప్రభుత్వం 25 శాతం మే- ర తగ్గించింది. దీని ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ దారులు, మ్యూచువల్ ఫండ్లు, షేర్ల ద్వారా డివిడెండ్ పొందేవారు, అద్దెల ద్వారా ఆదాయం పొందే యజమానులు చేతుల్లో లిక్విడిటీ పెరుగనుంది.
అంటే, టీడీఎస్ తగ్గింపు ద్వారా పొందిన మొత్తాన్ని తిరిగి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ స్వీయ అంచనా పన్ను నిర్దిష్ట పరిమితి దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవలసి ఉంటుంది. ఫిక్స్ డిపాజిట్ పై చెల్లించే రూ. 50,000 వడ్డీకి బ్యాంక్ 10 శాతం టీడీఎస్ కింద రూ.5000 డిడక్ట్ చేస్తే.. రేట్ల తగ్గింపు వల్ల టీడీఎస్ 7.5 శాతానికి తగ్గుతుంది.
దీంతో డిడక్ట్ చేసే మొత్తం 3,750కి తగ్గుతుంది. దీని వల్ల చేతిలోకి అధిక మొత్తం వస్తుంది. టీడీఎస్ తర్వాత వచ్చే వడ్డీ ఆదాయం రూ.46,250. అయితే వడ్డీ ఆదాయంపై చెల్లించే టాక్స్ లో మాత్రం మార్పుండదు. పైగా అధిక పన్ను చెల్లించాల్సి రావచ్చు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్నారనుకుంటే, 10 శాతం టీడీఎస్ పోను 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే టీడీఎస్ రేటు తగ్గడం వల్ల స్వీయ అంచనా పన్ను చెల్లించే సమయంలో 22.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.