కాంగ్రెస్ లో మున్సిపల్ గోల టిక్కెట్ల కోసం అప్పుడే ఆశ
ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల కోసం కాంగ్రెస్ లో ఇప్పటినుంచే ఆశావహులు పోటీ పడుతున్నారు. వివిధ మున్సిపాలిటీల్లో టికెట్లను ఆశించేవారి సంఖ్య అన్ని పార్టీల్లోనూ భారీగానే ఉంది. ముఖ్యంగా ఎన్నికలనే సరికి కాంగ్రెస్ లో టిక్కట్లు అశిస్తున్న వారు ఎక్కువగానే ఉంటారు.
ఆయా మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఎవరికి వాళ్లుగా గ్రూపులు విడిపోయి లోపాయకారిగా ప్రచారాన్ని సాగిస్తుండడంతో అప్పుడే సెగపు డుతోంది. ఈ వ్యవహారం కారణంగా కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలు తప్పవని భావిస్తున్నారు.
అయితే బలగం ఉన్న వారికే టికెట్ వస్తుందన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కారణంగా టిక్కెట్లు దక్కని వారు ఇప్పుడు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లోనూ పార్టీ ఆధినేతలు టికెట్లపై భరోసా కల్పిస్తూ సీనియర్లకే అవకాశం ఉంటుందని బలంగా చెప్పారు.
పార్టీ బలోపేతానికి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అంతా భావిస్తున్నారు. దీంతో గ్రూపులుగా విడిపోయినా..
ఎవరికి వాళ్లు ప్రజల మధ్యకెళ్లి తమ ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలు హడావుడిగా కాంగ్రెస్లో చేరుతుండటంపై సీనియర్లు మండిపడుతున్నారు.
తెరాస నేతల ఒత్తిళ్లను తట్టుకుంటూ పార్టీ కోసం సమయాన్ని వెచ్చించడంతో పాటు సొంతంగా డబ్బు ఖర్చు చేసి ప్రతిపక్ష హోదాలో ప్రజాసమస్యల పై పోరాటం చేసిన తమను గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరికొందరు అప్పుడే అంటున్నారు. కాంగ్రెస్ లో కొందరు అభ్యర్థులు రెండు మూడేళు గా టికెట్లపై ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు.
దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు ఏవిధంగా మారనున్నాయో అనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గందరగోళానికి దారి తీస్తున్నాయి. పాత వాళ్లను పక్కన పెట్టి కొత్త వాళ్లను అందలం ఎక్కిస్తే సహించేది లేదని గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన నేతలు చెబుతున్నారు.