తెలంగాణ విమోచనను మరచిపోతే ఎలా?

తెలంగాణ విమోచనను మరచిపోతే ఎలా?


 


నేటి తరానికి తెలంగాణ విమోచనోత్సవ ప్రాధాన్యం తెలియచేయాల్సిన అసవరం ఉంది. తెలంగాణ విముక్తం గురించి ఇంతకాలం ఎవరు మాట్లాడినా పెద్దగా విమర్శలు రాలేదు . 


పోరాటాలు చేసిన వారు సైతం విమోచన గురించి గట్టిగా అరచినవారే. అందరూ విమోచనోత్సవాన్ని జరపాలని కోరిన వారే. కానీ అధికారంలోకి రాగానే మరచిపోతున్నారు. దీనిని డిమాండ్చేసిన వారిని చిన్నచూపు చూస్తున్నారు. అదేదో మహాపాపం అయినట్లుగా భావిస్తున్నారు. ఎందుకీ తేడా అన్నది పాలకులు గమనించాలి. 


  కానీ గత కొన్నేళ్లుగా బిజెపి ఈ అంశాన్ని ఎత్తుకోగానే విమర్శలు చెలరేగడం చూస్తున్నాం. ఆనాటి పోరాటంలో బిజెపి ఎక్కడుందని కొందరు కమ్యూనిస్టులు, కుహనా జర్నలిస్టులు వాదిస్తున్నారు. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో లేకుంటే మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోకూడదా అన్నది ఈ కుహనా వాదులు చెప్పాలి.  


 తెలంగాణ విమోచనం గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంది. అలాగే జరుపుకునే బాధ్యత కూడా అందరికీ ఉంది. అందువల్ల దీనిపై రాద్దాంతాలు అనవసరం. సెప్టెంబర్ 17న భారత్ యూనియన్ లో తెలంగాణ లేదా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయినందున ఉత్సవాలను జరుపుకోవాలి.  


 ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిందన్న వాదనతో దీనిని పక్కన పెట్టాలనుకోవడం మూర్ఖత్వం తప్ప మరోటి కాదు. ఒకవేళ బిజెపి డిమాండ్చేయడం పక్కన పెడితే అధికారంలో ఉన్నవారు ఎందుక దీనిని నిర్వహిం చడం లేదో చెప్పాలి. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం 1948 సెప్టెంబర్ 17ననే వచ్చిందన్నది కాదనలేని సత్యం.  


ఇది చరిత్ర. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని తమ సంకుచిత ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ఎండగట్టాలి. ఆనాటి ముస్లిం నిజాం నవాబు దాష్టీకాలు ప్రపంచానికి, నేటి తరానికి తెలియచేయడంలో ఎంతమాత్రం తప్పు లేదు. ఇది చారిత్రక ఘట్టం తప్ప కల్పిత గాధ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి.


  ముమ్మాటికి అది దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన యుద్ధం. అది రాచరిక పాలన వెన్ను విరిచిన ప్రజా పోరాటంగా చరిత్ర కెక్కింది. నిజాం నవాబు ఆశీస్సులతో రాజకార్లు జరిపిన దాష్టీకాలను కాదనగలమా అన్నది చెప్పాలి. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక దురగాతాలు జరిగాయి.


   భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఉరితీసారు. జలియన్ వాలా బాగ్ లాంటి దుర్మార్గాలు చోటు చేసుకున్నాయి. ఇది చరిత్ర.. కాదనగలమా! అన్నది చెప్పాలి. విచ్చుకత్తుల మతోన్మాద మూకలు చేసిన హత్యలు, మాన భంగాలు, మతమార్పిడులు, అత్యాచారాలు అన్నీ మరచిపోగలామా చెప్పాలి.


  చరిత్రలో ఓ పీడకల అయినా మరచిపోగలమా చెప్పాలి. మానవ చరిత్ర లోనే ఒక రాక్షసకాండ లాంటి అధ్యాయం. ఖాసిం రజ్వీ, నిజాం నవాబు కలిసి తెలంగాణలో రక్త చరిత్ర లిఖించారు. ఈ ఘటన తరవాతనే తెలంగాణ విముక్తం అయ్యింది. నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ సైనిక చర్యకు దిగకుంటే ఏమి జరిగి ఉండేదో ఈ కుహనావాదులు చెప్పాలి.  


అమానుషం మీద తిరుగుబాటు జరిగింది. బలవంతపు మతమార్పిడులు, సాంస్కృతిక అణచివేతలకు తెలంగాణ చరిత్ర సాక్షీభూతం. అవినీతి, అన్యాయం, భూస్వామ్య దోపిడీలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఉద్యమం, సాయుధ ప్రతిఘటనలను కాదన గలమా అన్నది చెప్పాలి. 


రైతాంగ యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గళాలే కాదు, గన్నులు ఎత్తారు. ప్రపంచ పీడితవర్గం రాసిన పోరాట మహాకావ్యంలో ఒక సువర్ణ అధ్యాయం ఈ తెలంగాణ పోరాటం. రజాకార్ల దౌర్జన్యాలకు బైరాన్పల్లి, పరకాల లాంటి ఘటనలు మన కళ్ల ముందు కదలాడుతాయి.  


నిజాం పాలనను గట్టిగా వ్యతిరేకించకపోయినా ఆనాటి సమాజంలో ఎందరో ఉదారవాద ముస్లిం పెద్దలు రజాకార్లను కట్టడి చేశారు. నిజాంను అలవోకగా గద్దెదించిన భారత ప్రభుత్వం తెలంగాణ విముక్తికి నాంది పలికింది. భారత్ లో విలీనం అయ్యేలా చేసింది. 


రజాకార్లను పెంచి పోషించి పారిపోయిన దొరలు, ప్రభువు లు తిరిగివచ్చి ప్రజలనెత్తిన కూర్చొని రాజకీయ నాయకుల వేశాల్లో పాలన చేస్తూనే ఉన్నారు. ఒక్కో గ్రామంలో దేశముఖ్ లు, జమిందార్లు, జాగీర్దార్లు రజాకార్లతో కలిసి జరిపిన దురాగతాలను ఇప్పటికీ గ్రామాల్లో కథలుగా వివరిస్తారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని తమ సంకుచిత ప్రయోజనాల కోసం విస్మరించడం సరికాదు. 


 ముమ్మాటికి అది దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన యుద్దం. అది చారిత్రక సత్యం. దానిని బిజెపి ఎత్తుకున్నంత మాత్రాన చరిత్రను చిన్నచూపు చూడడం తగదు. కొందరి కోసం అంతటి త్యాగాల పునాదులపై నిర్మితమైన చరిత్రను విస్మరించడం అంతకన్నా మూర్జం మరోటి లేదు. బిజెపి కోరినట్లు విమోచన దినోత్సవాన్ని అధికారకంగా ఎవరు నిర్వహించినా తప్పులేదు. 


ఇది ఎవరో ఒకరికి వ్యతిరేకంగా జరిగింది కాదు. చరిత్రనుమననం చేసుకోవడం అవసరం. దాష్టీకాలను ఎండగట్టడం కావాలి. మనవాళ్ల త్యాగాలను స్మరించుకోవాలి. పేరు పేరునా వారికి నివాళి అర్పించాలి.


 అప్పుడే చరిత్రకు, బలిదానాలకు సార్థకత ఉంటుంది. అమరులను స్మిరంచుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూర్చే ప్రయత్నాలు నిరంతరంగా సాగాలి. వారిని స్మరించుకుంటేనే మనం అనభవిస్తున్న స్వేచ్ఛకు కూడా సార్థకత ఉంటుంది.


Comments