పడకంటి మనసులో మాట 24.05.2020 PART I


 


పడకంటి మనసులో మాట.......


 


కరోనా కల్లోల సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై చూపుతున్న శ్రద్ధ మోడీ సర్కార్ ప్రజారోగ్యం, ప్రజాక్షేమంపై చూపుతున్నట్లు కనిపించదు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే ముందు ప్రజల ప్రాణాలే ముఖ్యమని లాక్ డౌన్ 1.0 ప్రకటన సందర్భంగా చాటిన ప్రధాని లాక్ డౌన్ 2.0 ప్రకటన సమయానికి స్వరం కొద్దిగా మార్చారు. ప్రజా క్షేమంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా . కాపాడుకోవాలని పేర్కొన్నారు. అదే లాక్ డౌన్ 3.0 ప్రకటన ప్రజల ముందుకు రాకుండానే చేసేశారు. ఆ సందర్భంగా మద్యం సహా పలు అంశాలకు ఇచ్చిన వెసులుబాట్లు, మినహాయింపులు ఆయన ఆర్థిక పరిస్థితిపై పెట్టినంత శ్రద్ధ దేశంలో ఆమ్ ఆద్మీపై చూపలేదని సామాన్యుడు సైతం అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. ఇక లాక్ డౌన్ 4.0 దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా చేతులెత్తేసారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యేలా పరిస్థితి మారిపోయింది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలాన్ని ఎదుర్కొని 136 కోట్ల భారతీయుల భద్రతకు పూచీపడేందుకు కేంద్రం ఎలాంటి మినహాయింపులూ లేకుండా ముందుకు రాలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. దీనికి తోడు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అంటూ రోజుకో సారి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలు.


 _____________________________________________________________



 


కరోనా ప్రపంచ దేశాలన్నిటికీ బెంబేలెత్తిస్తున్నది. మానవాళి మనుగడపై సందేహాలను లేవనెత్తుతున్నది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించుకోవడమెలా అన్న మధన అన్ని దేశాల అధినేతలనూ కలవర పెడుతున్నది. భారత్ అందుకు మినహాయింపు ఎంత మాత్రం కాదు.


మిగిలిన దేశాల కంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకింత ముందుగా కరోనా కట్టడి చర్యలను చేపట్టారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య వందల్లో ఉన్న సమయంలోనే లాక్ డౌన్ అంటూ కరోనా కట్టడిని తిరుగులేని ఆయుధాన్ని బయటకు తీశారు. లాక్ డౌన్ ను దేశ వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలు చేశారు.



అయితే లాక్ డౌన్ అమలు అంతే కట్టుదిట్టంగా మరి కొంత కాలం కొనసాగించాల్సిన అవసరాన్ని మాత్రం ఆర్థిక కారణాలు చెప్పి విస్మరించారు. లాక్ డౌన్ 1.0, లాక్ డౌన్ 2.0లు అమలు అయిఎన సందర్భంగా దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది.


అసలు లాక్ డౌన్ కారణంగానే గ్రామీణ భారతంలో కరోనా వ్యాప్తి పెద్దగా జరగలేదు. నగరాలతో పోలిస్తే పట్టణాల్లో కరోనా వ్యాప్తి ఒకింత తక్కువగా ఉంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో కరోనా వ్యాప్తి మరింత నియంత్రణలో ఉంది.



ఇందుకు తొలి రెండు దశల లాక్ డౌన్ కారణమనడంలో ఎటువంటి సందేహానికీ తావు లేదు. అయితే లాక్ డౌన్ 3.0తో సడలింపుల పర్వం ప్రారంభమైంది. మద్యం దుకాణాలతో మొదలై ఒకదాని వెంట ఒకటిగా సడలింపులు ఇచ్చుకుంటూ పోవడంతో ఒక్క సారిగా కరోనా జూలు విదుల్చుకుని విజృంభించడం ఆరంభమైంది.


రోజుకు వందల కేసుల స్థాయి నుంచి వేల కేసుల స్థాయికి చెలరేగింది. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున ఐదు వేల కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఈ వ్యాప్తి వేగం రోజు రోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు.



ఒక అంచనా ప్రకారం జూన్ నెలాఖరులోగా ఈ వ్యాప్తి తీవ్రతను అడ్డుకట్ట వేసి ఆపడంలో విఫలమైతే జూలై ఆగస్టులలో దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తుంది. అమెరికాను కేసుల విషయంలో, మరణాల విషయంలో దాటేసినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదని ప్రపంచ ఆరోగ్య సంస్లే చెబుతోంది.


తొలి రోజులలో కరోనా కట్టడి విషయంలో భారత్ తీసుకున్న చర్యలను బహుదా ప్రశంసించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు భారత్ సడలింపుల పట్ల ఆందోళణ వ్యక్తం చేస్తున్నది. అంటే లాక్ డౌన్ సడలింపులతో ప్రధాని మోడీ కరోనా కట్టడి విషయంలో పగ్గాలు వదిలేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి వచ్చింది.


 


కరోనా కల్లోల సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిపై చూపుతున్న శ్రద్ధ మోడీ సర్కార్ ప్రజారోగ్యం , ప్రజాక్షేమంపై చూపుతున్నట్లు కనిపించదు. దేశ ఆర్థిక పరిస్థితి కంటే ముందు ప్రజల ప్రాణాలే ముఖ్యమని లాక్ డౌన్ 1.0 ప్రకటన సందర్భంగా చాటిన ప్రధాని లాక్ డౌన్ 2.0 ప్రకటన సమయానికి స్వరం కొద్దిగా మార్చారు.


ప్రజా క్షేమంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాలని పేర్కొన్నారు. అదే లాక్ డౌన్ 3.0 ప్రకటన ప్రజల ముందుకు రాకుండానే చేసేశారు.


ఆ సందర్భంగా మద్యం సహా పలు అంశాలకు ఇచ్చిన వెసులుబాట్లు, మినహాయింపులు ఆయన ఆర్థిక పరిస్థితిపై పెట్టినంత శ్రద్ధ దేశంలో ఆమ్ ఆద్మీపై చూపలేదని సామాన్యుడు సైతం అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి.


ఇక లాక్ డౌన్ 4.0 దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా చేతులెత్తేసారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యేలా పరిస్థితి మారిపోయింది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలాన్ని ఎదుర్కొని 136 కోట్ల భారతీయుల భద్రతకు పూచీపడేందుకు కేంద్రం ఎలాంటి మినహాయింపులూ లేకుండా ముందుకు రాలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.


దీనికి తోడు ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా మరణాల రేటు చాలా తక్కువ అంటూ రోజుకో సారి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలు.


 


దేశంలో కరోనా మరణాల శాతం మూడుకు మించలేదనీ, అదే అమెరికా వంటి దేశాలలో ఇది చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ప్రకటన చూస్తుంటే మహమ్మారి కాటుకు దేశంలో మూడు శాతం మంది జనం మరణించడం పెద్ద విషయం ఏమీ కాదని కేంద్రం భావిస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


లాక్ డౌన్ 4.0 ప్రకటన వద్దకు వచ్చే సరికి దేశ ప్రజల ఆరోగ్య రక్షణ కంటే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడమే ప్రభుత్వ ప్రాధాన్యమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.



20లక్షల ఆర్థిక ప్యాకేజీ, రెపో రేటు తగ్గించడం వంటి చర్యలు దేశంలోని సామాన్యుడికి ఏ మాత్రం ఊరటనివ్వలేకపోయాయని కేంద్రమే భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.


అందుకే కరోకా కట్టడి చర్యల కాడి వదిలేసి..... జాగ్రత్తలు తీసుకుంటూ మీ పనులు మీరు చేసుకోండని చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నది. మోడీ ఆర్థిక సలహాదారులు...కరోనా కారణంగా ప్రతిష్ట దిగజారిన చైనా కోల్పోబోతున్న పెట్టుబడులను ఆకర్షించడానికి ఆర్థిక కార్యకలాపాల కొనసాగింపు తప్పదని చెబుతున్నట్లు కనిపిస్తున్నది.



అందుకే దేశ ఆర్థిక పరిస్థితి సంగతి తరువాత ముందు ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాన్ని రక్షించడమే ముఖ్యమని లాక్ డౌన్ 1.0 ప్రకటన సందర్భంగా చెప్పిన మోడీ స్వరం ఆ తరువాత మారింది. అవసరం ముందుకు నడిపిస్తుందంటూ ఆయన వేదాంతంలోనికి వెళ్లిపోయారు.


ఒక్క పీపీఈ కిట్ కూడా లేని దేశం కరోనా వ్యాప్తి ఆరంభమయ్యాకా రోజుకు రెండు లక్షల పీపీఈ కిట్లు తయారుచేసుకునే సామర్థ్యాన్ని సముపార్జించుకుందని చెప్పారు.



సరే కరోనా మమమ్మారి ప్రాణాంతకమైనదే అనుమానం లేదు. కానీ అంతకు ముందు వైరస్ లు లేవా? అంటు వ్యాధులు లేవా? ఆ సమయంలో పీపీఈ కిట్లు లేకుండా దేశంలోని వైద్యులను అంటువ్యాధులు, వైరస్ లకు సోకితే సోకనీ అని వదిలేసే దయనీయ స్థితిలో భారత్ ఉండటానికి కారణం ప్రభుత్వాల నిష్పూచీ తనం కాదా?


ఇక దేశ ఆర్థిక పరిస్థితి దగ్గరకు వస్తే కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలనీ, అదే సమయంలో ప్రజలను ఆదుకోవడానికి, రాష్ట్రాలు ఆర్థికంగా దివాళా తీయకుండా ఉండేందుకూ హెలికాప్టర్ మనీ అందజేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చక్కటి సూచన చేశారు.



దానికి పరిగణనలోనికి తీసుకుని ఇప్పటికైనా మరోసారి కరోనా కట్టడి వ్యూహాన్ని పునస్సమీక్షించుకోవాల్సి ఉంది. చైనా కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్లనే మహమ్మారి వ్యాప్తిని ఒక్క రాష్ట్రానికే పరిమితం చేయగలిగింది.


వియత్నాం, న్యూజిలాండ్ లు కరోనా కట్టడి విషయంలో సాధించిన విజయాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. ఆర్థిక రంగం పటిష్టత కంటే ప్రజారోగ్య భద్రతే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యం కావాలి.



దేశంలో ద్రవ్య లోటు రాకుండా ఉండేందుకు అవసరమైతే నోట్ల ముద్రణకు ఉపక్రమించాలి. ద్రవ్యోల్బణం పెరుగుందన్న ఆందోళన పక్కన పెట్టాలి. కరోనా ముప్పు తొలగిపోయిన తరువాత ద్రవ్యోల్బణ కట్టడి చర్యలు తీసుకోవచ్చు.


ఏది ఏమైనా మే 31 తరువాత కూడా సడలింపులను తగ్గించి లాక్ డౌన్ ను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల అభీష్టం అదే. నిపుణుల సూచనలూ అవే. వాటిని ప్రధాని మోడీ పట్టించుకుని ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యం, ప్రాణం ముఖ్యమని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


 _____________________________________________________________


CLICK BELOW FOR PART 2


పడకంటి మనసులో మాట 24.05.2020 PART 2 - NEWS 9 TELUGU DAILY PAPER -  https://news9telugunews.page/FvgtAA.html


Comments