కేంద్ర ప్యాకేజీ పై విమర్శల వెల్లువ

కేంద్ర ప్యాకేజీ పై విమర్శల వెల్లువ


 


కోవిడ్ -19 సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ తక్షణ సమస్యలను తీర్చలేకపోతోందని టిఆర్ఎస్ చేసిన విమర్శలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సిఎం కెసిఆర్ ఈ ప్యాకేజీని దగా అని వర్ణించారు.


దీంతో లాభం లేదన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని అన్నారు. అలాగే దీనివల్ల కేంద్ర పెత్తనం ప్రస్ఫుటమయ్యిందన్నారు. రాషట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఆర్థికమంత్రి హరీష్ రావులు కూడా కేంద్రం తీరుపై ఘాటుగానే స్పందించారు. కేంద్రం ఇచ్చే ముష్టి మాకొద్దని సిఎం కెసిఆర్ గట్టిగనే అన్నారు.



దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఎదురుదాడికి దిగారు. అలాగే బిజెపి నేతలు కూడా కెసిఆర్ తీరును తప్పుపట్టారు. మొత్తంగా ఇప్పుడు వ్యవహరాం ఉద్రిక్తంగా మారింది. లాక్ డౌన్ విషయంలో కేంద్రాన్ని సమర్థిస్తూ వచ్చిన కెసిఆర్, అనూహ్యంగా ప్యాకేజీ పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.


కరోనా కష్టకాలంలో వలస కార్మికులను గాలికొదిలేసిన కేందప్రభుత్వం, వారిని రైళ్లలో తరలించేందుకు రాయితీలిచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.



కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డి ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నా, రైల్వేశాఖ రైలు టికెట్లలో పైసా కూడా రాయితీ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.


తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో కార్మికులకోసం రైళ్లను ఏర్పాటుచేయటమే కాకుండా, వారికి ఆహారం, తాగునీరు కూడా ఉచితంగా అందించిందని గుర్తుచేశారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించడంలో కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మానవత్వం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయని వినోద్ కుమార్ దుయ్యబట్టారు.



కార్మికులకు 85 శాతం ప్రయాణ ఖర్చులు భరిస్తున్నట్లు కేంద్రమంత్రులు చెప్పడం పచ్చి అబద్ధమని స్పష్టంచేశారు. ఇకపోతే ప్యాకేజీ జిడిపిలో 10 శాతం అని ప్రభుత్వం పేర్కొందని, అయితే జిడిపిలో 1 శాతానికి సమానమని రేటింగ్ ఏజెన్సీ పిచ్ సొల్యూషన్స్ పేర్కొంది. రూ. 20 లక్షల . కోట్లు


లేదా జిడిపిలో 10 శాతం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ 12న ప్రకటించారు. ఈ ప్యాకేజీని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఐదు విడతలుగా ప్రకటనలు చేశారు. ప్యాకేజీలో సగం ఆర్థిక చర్యలతో ముడిపడి ఉంది, వీటిని ముందుగా ప్రకటించారు.



అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య లభ్యత ప్రకటనలు కూడా ప్యాకేజీలో భాగంగా కలిపారని ఫిచ్ సొల్యూషన్స్ నివేదిక తెలిపింది. ఫిచ్ నివేదిక ప్రకారం కోవిడ్ 19 సంక్షోభం నేపథ్యంలో -ఆర్థిక విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపిస్తోంది.


2020-21లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 1.8 శాతంగా ఉంటుందని అంచనా. భారత ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం పెరుగుతోంది, ఎందుకంటే కోవిడ్ -19కు వ్యాప్తి ఒక వైపు పెరుగుతోంది. మరోవైపు దేశీయ, ప్రపంచ డిమాండ్ కూడా బలహీనంగా ఉందని ఫిచ్ వెల్లడించింది.



ఉద్దీపనలు ఉన్నా ఆర్థిక వ్యవస్థ ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తున్నామని, ఆర్థిక లోటు కట్టడికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని సంస్థ తెలిపింది. మే 13 నుంచి 17 మధ్య చేసిన ప్యాకేజీ ప్రకటనలలో ప్రభుత్వం రుణ హామీలతో పాటు నియంత్రణ సంస్కరణలు చేసింది.


తిరిగి చెల్లించే వ్యవధిలో పొడిగింపు మొదలైనవి ఉన్నాయి. అయితే ప్యాకేజీ కింద కొత్త వ్యయం జిడిపిలో కేవలం ఒక శాతం మాత్రమే. రేటింగ్ ఏజెన్సీ ప్రకారం, ఈ ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థ తక్షణ సవాళ్లను ఎదుర్కోలేకపోయింది. అందువల్ల 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం, సంయుక్త స్థాయిలో లోటు అంచనాలను వరుసగా ఏడు శాతం, 11 శాతానికి పెంచుతున్నామని ఫిచ్ తెలిపింది. ఇంతకు ముందు ఈ అంచనా వరుసగా 6.2 శాతం, తొమ్మిది శాతంగా ఉంది.


Comments