వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం


రైతులను బలోపేతం చేస్తుంటే విమర్శలా? నియంత్రిత పంటల విదానం రైతులకే మేలు స్పష్టం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి


 


హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. డిమాండ్ ఉన్న పంటలు వేయాలని చెబితే కొందరు తప్పుపట్టడాన్ని మంత్రి విమర్శించారు.


రైతుబంధు ఎగవేయడానికి పంటల నియంత్రణ తెచ్చారని కొన్ని పార్టీల వారు చేసిన విమర్శలను మంత్రి తప్పుపట్టారు. అసలు వ్యవసాయంలో మార్పులు లేకుంటే రైతులకు గిట్టుబాటు ఎలా అవుతుందన్నారు.నియంత్రిత విధానంలో వ్యవసాయం చేసేందుకు నెల రోజులుగా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు, ప్రొఫెసర్లు, వ్యాపార సంస్తలతో సిఎం కెసిఆర్ సమావేశాలు నిర్వహించాకనే పంటల విధానాన్ని ప్రకటించారని అన్నారు.


ఈ ఏడాది కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి రావడం, మె-రుగైన వర్షపాతం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో మరో 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.వర్షాధారంగానే కాకుండా బోర్లు, ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న తరుణంలో అంతా ఒకేరకమైన పంటలు వేస్తే కొనేందుకు ప్రభుత్వం ఎలా ముందుకు వస్తుందని అన్నారు. వర్షాకాలం లో ఏ పంటలు వేయాలి, వేటికి డిమాండ్ ఉందనే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేసి చెబితే తప్పెలా అవుతుందన్నారు.


రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగవుతుండగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల్లో పసుపు వేసుకోవచ్చు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో రెండున్నర లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగుకు అనుమతి ఉంది.సోయాబీన్, బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటల సాగు యధావిధిగా ఉంటుందన్న సిఎం కెసిఆర్ సూచనలు పాటించాలన్నారు.


ఈ ఏడాది 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగు చేసి భవిష్యత్తులో విస్తీర్ణం మరింత పెంచుతామని, ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ఈజెడ్లు, కోల్డ్ స్టోరేజీలు పంటల సాగుకు సంబంధించి స్పష్టమైన విధానాలతో సిఎం కెసిఆర్ ఉన్నారని అన్నారు.జిల్లాలవారీగా ఏయే పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే అంశంపై వషన్లు నిర్వహిస్తాం. అన్ని జిల్లాలకు అన్ని రకాలైన పంటలను కేటాయిస్తాం. సాగు విస్తీర్ణానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రభుత్వం వద్ద ఉంది.


రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ఈజెడ్లు ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా 40 లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మిస్తాం. ప్రతి నియోజక వర్గంలోనూ కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 90 శాతం పూర్తయింది.రైతు బీమా పథకం కోసం మొదట్లో రూ. 700 కోట్లు ప్రీమియంగా చెల్లించగా ఈ ఏడాది రూ. 1,100 కోట్లు వెచ్చించాం. విత్తనాల కొరతను అధిగమించాం. తెలంగాణ సీడ్ బౌల్ అవుతోందన్నారు. బృహత్తర ప్రణాళికతో ముందుకు వస్తున్న తరుణంలో ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు. అంతరూ కలసి తెలంగాణ రైతును ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.


Comments