ప్రభుత్వ కార్యాలయాలకు మళ్లీ కళ

ప్రభుత్వ కార్యాలయాలకు మళ్లీ కళ


 


అమరావతి: ఎపిలో లా డౌన్ నిబంధనల సడలింపు కారణంగా సిఎం జగన్ ఆదేశాలతో గురువారం నుంచి అక్కడ బస్సులు రోడ్డెక్కనున్నాయి. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేస్తాయి. ఉద్యోగుఉల విధిగా నిబంధనల మేరకు హాజరుకావాల్సి ఉంటుంది.


ఈ మేరకు ఎపి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు పది నుంచి పదిహేను శాతం బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారినీ, బస్టాండుకు వచ్చి గ్రౌండ్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకున్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు.



పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు.


అయితే డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్ విధానం మార్చడం వల్ల వీలైనంత మే- రకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. మొత్తంగా ఆర్టీసీ బస్సులు అరవై రోజుల తర్వాత ఎట్టకేలకు రోడ్డెక్కుతు న్నాయి.



లాక్ డౌన్ తో రెండు నెలలుగా డిపోలకే పరిమితమై గురువారం నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 18 నుంచే బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇందుకు రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.


రాష్ట్రవ్యాప్తంగా 128 బస్ డిపోలు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని డిపోల నుంచి సాధ్యమైనన్ని బస్సులు నడపాలని అధికారులు భావించారు.



బస్సుల్లో సీటింగ్ మార్పు, గ్రీన్ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది.


ప్రభుత్వ కార్యాలయాలు కూడా నేటినుంచే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులంతా గురువారం నుంచి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.



కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న వారికి, గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.


దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ గురువారం నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. నూటికి నూరు శాతం ఉద్యోగులు విధులకు హాజరు కావాలి. కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించే ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి, చేతులను శానిటైజ్ చేసిన తర వాతనే లోనికి అనుమతిస్తారు.



అలాగే అన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు శానిటైజ్ చేయాలని, ప్రతీ ఉద్యోగి విధిగా మాస్క్ ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. కార్యాలయాల్లో ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. రెండు గంటలకోసారి సబ్బు, శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి. కార్యాలయాల్లో పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం.


ఎవ్వరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ఇకపోతే భౌతిక సమావేశాలు తగ్గించి టెలి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలను నిర్వహించాలి. ఉద్యోగులు విధుల్లో ఉండగా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే హోం క్వారంటైన్ లో ఉండాలి.



సంబంధిత అధికారులు సెలవును మంజూరు చేస్తారు. కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించరు. స్పందన, తపాల్ సెక్షన్, రిసెప్షన్స్ లో మాత్రమే సమస్యలపై విజ్ఞాపనలు చేయాలి. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలను ఉద్యోగులందరూ తప్పనిసరిగా పాటించాలి. ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు చర్యలు తీసుకుని అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు.


Comments