పడకంటి మనసులో మాట 14.06.2020


పడకంటి మనసులో మాట.....


 _____________________________


అంచనాల ప్రకారం జూన్ చివరి నాటికి దేశంలో పది లక్షల మంది కరోనా బారిన పడటం తథ్యం. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేసులు, మరణాల శాతాలంటూ ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాయి. మూడు లక్షల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులతో భారత్ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ వ్యాప్తి వేగం ఇలాగే కొనసాగితే దేశం రెండో స్థానంలోకి చేరడానికి ఎంతో కాలం పట్టదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కేంద్రం మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ యోచన చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల ద్వారా తెలుస్తున్నది.


 _____________________________


మళ్లీ లాక్ డౌన్ తప్పదా ?



దేశంలో కరోనా విజృంభణ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ వినా మరో మార్గం లేదన్నది సామాన్య జనం సైతం విశ్వసిస్తున్నారు. ముందు కరోనా వ్యాప్తిని అడ్డుకుంటే... ఆ తరువాత ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవచ్చునని అన్ని వర్గాల నుంచీ వ్యక్తమౌతున్న అభిప్రాయంగా కనిపిస్తున్నది.


కరోనా కేసులు అత్యధికంగా నమోదౌతున్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీలలో అయితే మళ్లీ లాక్ డౌన్ విధించాలనీ, సడలింపులను ఉపసంహరించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన ఆయా రాష్ట్రాల హైకోర్టులు లాక్ డౌన్ విధించడానికి ఉన్న అభ్యంతరాలేమిటీ, సడలింపులతో కరోనాను ఎలా అరికడతారు, నిరోధిస్తారు అని ప్రభుత్వాలను ప్రశ్నించాయి కూడా.



అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి ఉధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సామాజిక నిపుణుల సూచనలు, హెచ్చరికలను పట్టించుకోకుండా దశలవారీ లాక్ డౌన్ సడలింపుల బాట ఎందుకు పట్టింది. కేంద్రానికి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలన్నీ ఎందుకు మద్దతుగా నిలిచాయి.


ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం వస్తున్నది. లాక్ డౌన్ వల్ల ప్రజలపై, సంస్థలపై, ప్రభుత్వాలపై పడే ఆర్థిక భారాన్ని భరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. రాజకీయ లెక్కల మేరకు... కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆర్థిక పురోగతి, ప్రజాకర్షక పథకాలకు నిధులు వెచ్చించేందుకు చూపే ఉత్సాహం...ప్రజారోగ్య పరిరక్షణకు, వారి ఆరోగ్య భద్రతకు వెచ్చించేందుకు సిద్ధంగా లేవు.



అంటు వ్యాధులు వ్యాపించి దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్న సమయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అవగాహన, సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. అయితే గత ఆరేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ విధానాల పుణ్యమా అని అటువంటి సమన్వయానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.


అదే ఇప్పటి ఈ గందరగోళ పరిస్థితికి కారణమైంది. కేంద్రం ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు సరికదా, రాష్ట్రాలకు రావలసిన బకాయిలను చెల్లించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తున్నది.



కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో పడ్డ రాష్ట్రాలు, సంస్థలను ఆదుకునేందుకు ప్రకటించిన భారీ ప్యాకేజీ కూడా అనేక లొసుగులతో, గతంలో చేసిన సాయాన్ని, కేటాయింపులను కూడా ఇందులోనే కలిపేసి రాష్ట్రాల కాళ్లూ చేతుతూ కట్టేసిన విధంగా ఉంది.


ఇక్కడే మోడీ సలహాదారులు ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి రాజకీయ లబ్ది చేకూర్చడం కోసమే ఆలోచించారు తప్ప కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించే మార్గం గురించి పట్టించుకోలేదు. అందుకే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ప్యాకేజీ ఇసుమంతైనా రుచించలేదు.



సంక్షోభ పరిస్థితుల్లో కూడా మోడీ రాజకీయ లబ్ది పొందే అవకాశాల గురించే యోచిస్తున్నారు తప్ప ఆదుకునే ప్రయత్నం చేయడం లేదన్న భావన ఏర్పడటానికి ఈ విధానమో దోహదం చేసింది. అందుకే అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ సడలింపులు, ఎత్తివేతకే మొగ్గు చూపాయి.


లాక్ డౌన్ సడలింపుల కారణంగా కరోనా మహమ్మారి విజృంభణ వేగం అనూహ్యంగా పెరిగింది. అంచనాల ప్రకారం జూన్ చివరి నాటికి దేశంలో పది లక్షల మంది కరోనా బారిన పడటం తథ్యం. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేసులు, మరణాల శాతాలంటూ ప్రజలను మభ్య పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నాయి.



మూడు లక్షల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులతో భారత్ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ వ్యాప్తి వేగం ఇలాగే కొనసాగితే దేశం రెండో స్థానంలోకి చేరడానికి ఎంతో కాలం పట్టదని నిపుణులు చెబుతున్నారు.  ఈ పరిస్థితుల్లోనే కేంద్రం మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ యోచన చేస్తున్నట్లుగా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల ద్వారా తెలుస్తున్నది.


ఈ విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకునేందుకు మోడీ సమాయత్తమౌతున్నారు. 16, 17 తేదీలలో ఆయన రాష్ట్రాల మ ఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కరోనా కట్టడి కోసం మరోసారి పూర్తి స్థాయి లాక్ డౌన్ యోచనకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి లేదు.



ప్రజా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠినమైనా సరే నిర్ణయాలు తీసుకోక తప్పదు. అయితే... లాక్ డౌన్ నిర్ణయానికే కేంద్రం వస్తే తొలి సారి లాక్ డౌన్ విధించిన సందర్భంగా విస్మరించిన అంశాలను ఈ సారి మరింత జాగ్రత్తగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది.


ఇప్పటికే వలస కార్మికుల తరలింపు విషయంలో వైఫల్యానికి సమాధానం చెప్పుకోలేక సమతమతౌతున్న కేంద్రం ఈ సారి అటువంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. కరోనా మహమ్మారికి పూర్తిగా తరిమి కొట్టిన న్యూజిలాండ్ అనుసరించిన విధానాలను పరిశీలించి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.



అమెరికా వైఫల్యాన్ని చూపుతూ అంతకంటే మనం మెరుగైన స్థితిలో ఉన్నామంటూ భుజాలు చరుచుకోవడం సరికాదు. కరోనా మహమ్మారి సామాజిక సంక్రమణం స్థాయికి ఇప్పటికీ విస్తరించలేదన్న అంశమొక్కటే ఇప్పుడు భారత్ కు ఊరటనిచ్చే అంశం.


పరిస్థితి ఇలాగే కొనసాగితే... వ్యాప్తి సామాజిక సంక్రమణం సాయికి చేరుకోవడం ఎంతో దూరంలో లేదన్న వైద్య నిపుణుల హెచ్చరికలను చెవిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య రక్ష వ్యవస్థ పటిష్టంగా లేని భారత్ లో మహమ్మారి సామాజిక సంక్రమణం స్థాయికి చేరుకుంటే సంభవించే నష్టం ఊహించడానికే భయం వేసేదిగా ఉంది.



ఆ పరిస్థితి రాకుండా మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. కరోనాతో సహజీవనం తప్పదంటూ నిర్లిప్తంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదన్న హెచ్చరికనుమోడీ సర్కార్ పట్టించుకోవాలి. ప్రజారోగ్య రక్షణకు మించిన ప్రాధాన్యత మరేదీ లేదని గుర్తించాలి.


______________________________


చేసిన మంచిని చెప్పుకోలేని దైన్యం 



ఆంధ్ర పద్ధేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయినా నేడో రేపో ఎన్నికల ప్రకటన వెలువడుతుందా? అన్నంత వేడిగా రాజకీయం ఉంది. రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలు, విధానాలు బహుదా ప్రసంసనీయమే అయినా.


ప్రభుత్వం మాత్రం వాటిని చెప్పుకోవడానికి అవకాశం లేని వివాదాలలో రోజు రోజుకూ చిక్కుకుంటోంది. ఒక చేత్తో ప్రజారంజక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేస్తూనే మరో చేత్తో అనవసర వివాదాలకు తెరతీస్తున్నది. డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ఎస్ఈసీ రమేష్ బాబు వ్యవహారం వంటికి ఇందుకు ఉదాహరణలు.



ఇక ఇఎస్ఎ కుంభకోణంలో మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్చే అచ్చెన్నాయుడి అరెస్టును తెలుగుదేశం వినా మిగిలిన వారంతా సమర్థింంచారు. అయితే అదే సమయంలో ఆయనను పరామర్శించడానికి గుంటూర | జీజీహెచ్ కు


చేరుకున్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుమతి నిరాకరించడం అచ్చెన్నాయుడి అరెస్టుతో ప్రభుత్వం పట్ల ఏర్పడిన సానుకూలతను భగ్నం చేసే విధంగా ఉంది.అలాగే | చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయడం కూడా.



రోడ్డు మార్గాన అచ్చెన్నాయుడినిక అమరావతికి తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఆయనను పరామర్శించడానికి వచ్చిన చింతమనేనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన తీరు కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న భావన ప్రజలలో కలిగేందుకు ఆస్కారమిచ్చింది.


కింది స్థాయిలో అధికారుల దుందుడుకు చర్యలకు జగన్ కోటరీగా ఏర్పడిన వైకాపా నేతలు మద్దతు ఇస్తుండటం వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.



రాజకీయంగా జగన్ కు, ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్న ఇటువంటి వారి వ్యవహారానికి ముఖ్యమంత్రి ఎంత తొందరగా చెక్ పెడితే అంత మేలు. అచ్చెన్నాయుడు కోరుకున్న ఆసుపత్రిలో వైద్యం చేయించాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి జైళ్ల శాఖ డీజీ అనుమతి నిరాకరించారు.


దాదాపు ఒకే సమయంలో రెండు పరస్పర విరుద్ధ భావనలు జనంలో కలిగేందుకు దోహదపడే నిర్ణయాలివి. అచ్చెన్నాయుడి వైద్యం విషయంలో జగన్ ఉదారతకు వచ్చిన సానుకూలత కంటే చంద్రబాబుకు అనుమతి నిరాకరణ వల్ల వచ్చే వ్యతిరేకతే ఎక్కువ.


ఇటువంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయనడంలో సందేహం లేదు.


______________________________


తెలంగాణలో రైతే రాజు 



తెలంగాణ వ్యవసాయం గాడిన పడుతోంది. అన్నదాతకు అన్ని విధాలుగా అండ దొరికిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. సిఎం కెసిఆర్ ఒక్కో నిర్ణయం వారిని ముందుకు న డిపించేదిగా ఉంటోంది. వ్యవసాయాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇప్పటికే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా రైతులకు కల్లాలను కట్టి ఇవ్వాలని చూస్తున్నది.


ధాన్యం చేతికొచ్చే సమయంలో కల్లాలను పొలంలోనే ఏర్పాటు చేస్తారు. అయితే అలా కాకుండా రైతులకు సమిష్టి గా ఉపయోగపడేలా తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందుబాటులో కల్లాలను కట్టబోతున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చర్చించి నివేదికను రూపొందిస్తోంది. దీనిని సెం కెసిఆర్ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి రానుంది.



రైతులకు మరో శుభవార్త చెబుతానని ఇటీవల కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ ప్రకటించారు. అదీఇదీ ఒకటో కాదో కానీ... ఇది కూడా ఓ మంచి నిర్ణయంగానే చూడాలి. రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు పల్లె పల్లెనా కల్లాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.


ఉపాధిహామీ పథకం కింద హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో లక్ష కల్లాలు నిర్మించడంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. కల్లాలు లేక ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు రోడ్డెక్కుతున్నారని గుర్తించారు. స్థానిక అవసరాల మేరకు ప్లాట్ ఫామ్ నిర్మాణాలు చేపట్టనున్నారు.



సిఎం కెసిఆర్ ముందుచూపు, రైతుల పట్ల ఉన్న ప్రేమ, వ్యవసాయం పట్ల ఉన్న అవగాహన వల్ల తెలంగాణ రైతాంగానికి మంచి రోజులొచ్చాయి. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికి ఆదర్శంగా మారుతున్నది. ఇప్పటికే రైతులకోసం పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం రైతు పండించిన పంటకు మద్దతు ధర దక్కేందుకు వీలుగా నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రూపొందించింది.


వ్యవసాయంలో లాభాలు రావాలంటే ప్రధానంగా కరెంట్, నీళ్ళు, రైతుకు దన్నుగా నిలువడం, వారిలో మేమున్నామనే ధైర్యాన్ని వ్వడం అవసరం. రైతుబంధు ఓ చారిత్రాత్మక నిర్ణయం. రైతుబీమా, రైతుబంధు సమితుల ఏర్పాటు వంటివి రైతులకు ఎంతో విశ్వాసాన్ని, బలాన్ని కల్పించేవే.



ఇన్ని చేసినా ఇటీవల ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని కొన్ని చోట్ల ఆందోళనలు కూడా జరిగాయి. అయితే ఇది ఆయా ప్రాంతాల రైతుబంధు సమితి నాయకుల బాధ్యతగా చూడాలి. ఎక్కడైతే అన్నదాతులు ఆందోళనకు దిగారో అక్కడికి వెళ్లి వీరు నిజానిజాలు గ్రహించాల్సి ఉంది.


కరోనా విపత్తు సమయంలో కూడా ప్రభుత్వమే రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న కమిట్ మెంట్ కు నిదర్శనంగా చూడాలి. ఇన్నాళ్లు గా తీసుకున్న సానుకూల నిర్ణయాలతో ఈసారి రికార్డుస్థాయిలో వరి ధాన్యం పండింది. దేశానికే అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరింది.



ఇకపోతే సాగునీటి రంగంలో కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును చేపట్టారు. అతికొద్ది కాలంలోనే దాన్ని పూర్తిచేసి తెలంగాణను జల భాండాగారంగా మార్చారు. ఎక్కడి గోదావరి.. ఎక్కడి కొండపోచమ్మ సాగర్! కొండపోచమ్మ సాగర్‌కు గోదావరి నీళ్ళను ఎదురెక్కించడం అరుదైన ఇంజనీరింగ్ ప్రతిభగా చెప్పుకోవాలి.


మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. కాళేశ్వరం నీళ్ళు చెరువుల్లో నింపుతున్నారు. ఈ వర్షకాలంలో మరిన్ని నీళ్లు ఎదురెక్కే అవకాశం రాబోతోంది. నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా రైతు లాభాలబాట పడతాడన డంలో సందేహం లేదు.



అయితే పండించిన పంటలకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉంటే మరీ మంచిది. అందరూ ఒకే పంట వేయడంతో డిమాండ్ లేక పంటకు సరైన ధర రాదు. రైతు తన భూమిలో వివిధ రకాల పంటలు వేసినట్లయితే డిమాండ్ పెరిగి ధరకూడా ఎక్కువ వస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది.


పంటమార్పిడి నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేసేందుకు ముఖ్యమంత్రి పటిష్ఠ ప్రణాళిక రూపొందించారు. మరోవైపు రైతుబంధు సమితుల ద్వారా రైతు వేదికలు నిర్మించి రైతును సంఘటిత పరుస్తూ నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం వైపు మళ్ళిస్తున్నారు. వ్యవసాయం ప్రధానమైన తెలంగాణలో వలసలు లేని జిల్లాలు ఉండాలన్న ఆలోచనలో సిఎం కెసిఆర్ ఉన్నారు.



ఇక్కడి వారు ఇక్కడే ఉండి కూలీ చేసుకోవాలని, గల్ఫ్ దేశాలకు వలస పోవద్దని పలుమార్లు అన్నారు. ఇవ్వాళ వ్యవసాయం కేంద్రంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నది. కెసిఆర్ నేతృత్వంలో ఆదర్శవంతమైన వ్యవసాయంలో దేశంలోనే తెలంగాణను ఒక అద్భుతమైన, మొదటి వరుసలో నిలబెట్టే ప్రయత్నం కొనసాగుతున్నది.


రైతుకు అండగా రాష్ట్రస్థాయి వరకు అనేక రకాలుగా రైతులకు భరోసా ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టారు. రైతుకు అండగా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి రైతుబంధు సమితులు, వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు పనిచేస్తున్నారు. సాగునీరు, నకిలీ విత్తనాల, మందుల బెడద లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది.



పెట్టుబడికి రైతుబంధు, విత్తనం వేసిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు, పంట చేతికి రాగానే రైతుబంధు సమితుల ద్వారా దిగుబడి అమ్మకం, మినిమం మార్కెట్ రేటు కోసం పర్వవేక్షణ, లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయటం ద్వారా ప్రస్తుతం రైతుకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.


వ్యవసాయంలో ఇంతకు మించిన ఆదరణ అవసరం లేదు. ఇవన్నీ చేపట్టిన సిఎం కెసిఆర్ నిజంగా రైతుబాంధవుడే.


______________________________



For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India



Comments