అమరావతిలో పడిపోతున్న రియల్ రంగం

అమరావతిలో పడిపోతున్న రియల్ రంగం


అద్భుత రాజధాని ప్రచారంతో తొలుత ఊపు క్రమంగా పడిపోతున్న వ్యాపారం ఆందోళనలో రాజధాని ప్రాంత రైతులు


 


అమరావతి : టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంగా తగ్గింది. అమరావతి కల సాకారం కాకపోవడంతో పాటు అనేక సమస్యల కారణంగా అసలు కదలిక లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో నిలకడగా సాగింది.


కొత్త ప్రభుత్వం వచ్చాక తిరోగమనం లోనే నడుస్తోంది. ప్రధానంగా రాజధాని నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంది. సీఆర్డీఏలో కోర్ కేపిటల్ కమర్షియల్ ప్లాట్ గజం ఇటీవల వరకు రూ.


30వేల వరకు ఉండేది. అది ప్రస్తుతం రూ.25వేల నుంచి రూ. 20వేలకు తగ్గుతోంది. రాజధాని పరిధిలోని తుళ్ళూరు, తాడికొండ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, గుంటూరు తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లోని రైతుల్లో కొంత ఆందోళన నెలకుంది.


 



రాజధాని అభివృద్ధిపైనే భూములు, స్థలాల ధరలు ఆధారపడి ఉండడంతో ఏం జరగబోతోందని ప్రభుత్వ తీరును గమనిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో గతంలో ధరలు పెరిగిన సమయంలో అనేకమంది కుటుంబ అవసరాలకు ఎకరం, అరెకరం అమ్ముకున్నారు.


మరికొందరు ఇప్పటికప్పుడు తమ భూములు విక్రయించకపోయినప్పటికీ రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం అవుతుంది. రానున్న ఆరునెలల్లో ప్రభుత్వ నిర్ణయాలపై రియల్ ఎస్టేట్ రంగం ఆధారపడి ఉంటుందని రియల్టర్లు అంచనా వేస్తున్నారు.


ముఖ్యంగా రాజధాని ప్రాంత అభివృద్ధితో | పాటు ప్రధాన కంపెనీలు, సంస్థలు పెట్టుబడులు పెట్టిన పక్షంలో రియల్ వ్యాపారుల్లో కొంత కదలిక వస్తుందని వారంటున్నారు. ఒక వేళ రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా మందగించిన పరిస్థితులు ఎదురైతే గుంటూరు, విజయవాడ నగరాల్లో కొంత వరకు కొనుగోళ్ళు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


 



రాజధాని సహా జిల్లావ్యాప్తంగా స్థలాలు, భూములు, పొలాలు, ఇళ్ళ నిర్మాణాలు స్తంభించాయి. గతంలో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో చావుదెబ్బ తిన్న రియల్ ఎస్టేట్ రంగం ఆ తరువాత కొద్దిగా కోలుకున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం...


కొత్త ప్రభుత్వం పంథా తెలియకపోవడంతో కొంత సందిగ్ధంలో ఉంది. గతంలో రాజధానిలో గజం రూ. 25వేలు వరకు ధర పలికితే అదే స్థలం ఇప్పుడు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు దిగి వచ్చింది. అయినప్పటికీ కొనేవారు కనిపించడం లేదు.


గతంలో ఎకరం రూ. కోటి నుంచి కోటిన్నర వరకు ధర పలకగా ప్రస్తుతం ఆ ధర కొంత మేర తగ్గినప్పటికీ అక్కడ కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు కనిపించడం లేదు. . రాజధానికి సమీప 20 కిలోమీటర్ల పరిధిలో గతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూముల క్రయ విక్రయాలు సాగినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.


 



ఇక్కడ చోటు చేసుకుంటున్న రాజకీయ, ప్రభుత్వపరమైన పరిణామాలను అంతా నిశితంగా గమనిస్తున్నారు. కొంతమంది అనుకూల పరిస్థితులు ఏర్పడితే పెట్టుబడులు పెట్టవచ్చనే భావనలో ఉన్నారు. రాజధాని ప్రకటన తరువాత గుంటూరులో విపరీతంగా అపార్టుమెంట్లు నిర్మించారు.


మొదట్లో అందుకు అనుగుణంగానే కొనుగోళ్ళు జరిగాయి. ఆ తరువాత కొంతవరకు కొనుగోళ్ళు మందగించాయి. అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగాయి. అయితే కొద్ది సంవత్సరాలుగా ప్లాట్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతూనే ఉన్నాయి.



ముఖ్యంగా ఉద్యోగులు చిన్న వ్యాపారులు, రాజధానితో పాటు ఇతర ప్రాంతాల్లో భూములు అమ్ముకున్న వారు ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా అపార్టుమెంట్ల ఎ-లాట్ల కొనుగోళ్ళలో కూడా స్తబ్దత ఏర్పడింది.


ఫలితంగా ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లోని అపార్టుమెంట్లలో ఎ-లాట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే నగరంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం ప్లాట్ల కొనుగోళ్ళు కొనసాగుతున్నాయి.


Comments