ఇసుక కొరతతో ఆగిన నిర్మాణ పనులు

ఇసుక కొరతతో ఆగిన నిర్మాణ పనులు


వలస కూలీలకు పనుల దొరక్క అవస్థలు


 


నెల్లూరు : ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో ఇసుక కష్టాలు మొదలయ్యాయి. కొత్త పాలసీ తీసుకొచ్చే వరకు ఇసుక తవ్వకాలు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని రీచ్లన్నింటినీ అధికారులు మూసేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆపేయడంతో ఈ ప్రభావం పలు రంగాలపై పడింది.


 


ముఖ్యంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అక్కడక్కడా ముందుగా నిల్వ చేసుకున్న ఇసుక ఉన్నచోట తప్ప మిగతా చోట్ల నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు కరువయ్యాయి. కాగా అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న పలువురు వ్యాపారులు బహిరంగ మార్కెట్లో ఇసుక ధరలను రెట్టింపు చేశారు.జిల్లా మొత్తం పెన్నానది ఇసుకనే నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఇసుక తవ్వకాలను ఆపేయడంతో జిల్లాలో భవన నిర్మాణానికి కష్టాలు ఏర్పడ్డాయి. చాలా ఇళ్లు, అపార్ట్ మెంట్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. చివరి దశలో నిర్మాణాలు జరుపుకుంటున్న ఇళ్ల పూర్తికి యజమానులు తాపత్రయపడుతున్నారు.


 


బహిరంగ మార్కెట్లో ఇసుకను కొని నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కొందరు వ్యక్తులు ఇసుకను వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఇసుక లారీ లేదా ట్రాక్టరు రోడ్డెక్కితే అధికారులు పట్టుకుంటుం డటంతో ఆ ఇసుకను స్థానికంగానే అమ్ముతున్నారు. ఇసుక డిమాండ్ ఏర్పడడంతో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు.ముఖ్యంగా నెల్లూరు నగరం, పరిసర . ప్రాంతాల్లో నిన్నటి వరకూ ట్రాక్టరు ట్రక్కు ఇసుక రూ.2 వేలు ఉండగా ఇప్పుడు అది రూ.4 వేలకు చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థానికంగా సంపాదిస్తున్న ఉండే కాలువలు, చెరువుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నారు.


 


వలస వచ్చిన కూలీలు నెల్లూరు నగరంలో ఉంటూ నిత్యం జిల్లా నలుమూలలకు పనులకు వెళుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఈ పనులకు వెళ్లే వారు ఉన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోవడంతో వీరందరికీ పనులు లేకుండా పోయాయి.అయితే ఇప్పుడు పీడీ కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తుండడంతో చాలా వరకు ట్రాక్టర్ల యజమానులు అక్రమంగా ఇసుకను తరలించేందుకు సంపాదిస్తున్న కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. కొత్త పాలసీపై ప్రభుత్వం ఆదేశించిన విధంగా జిల్లాలో పరిస్థితిని తయారు చేసి పంపే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.వచ్చే నెల నుంచి కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో అమలవుతున్న పాలసీని పరిశీలించిన అధికారులు తదనుగుణంగా కొత్త పాలసీని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఉచిత విధానం కాకుండా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం సమకూరే విధంగా కొత్త పాలసీ ఉండబోతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.


 


 


Comments