దేశానికి దిక్సూచి తెలంగాణ సాగు

దేశానికి దిక్సూచి తెలంగాణ సాగు


 


దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంఏ9 లో విప్లవాత్మక మార్పులు రావాలి. కేంద్రం అధునాత వ్యవసాయ విధానంతో ముందుకు రావాల్సి ఉంది. నీటి లభ్యత,నేలల స్వభావం మేరకు పంటలు పండించడమే గాకుండా ఎగుమ తులు లక్ష్యంగా మన వ్యవసాయ విధానంలో మార్పులు రావాలి.


కరోనా నేపథ్యంలో మన అనభవాల మేరకు ప్రపంచంలో ఆహారధాన్యాల ఎగుమతుల్లో ముందుండేలా కేంద్రం చర్యలకు ఉపక్రమించాలి. కెల్లాగ్స్ లాంటి మక్కతో తయారు చేసిన కార్న్ ఫ్లెక్స్ స్వతహాగా మనం తాయరు చేసుకోవచ్చు. మనదగ్గర పుష్కలంగా మక్కలు పండుతాయి.



ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహ కాలు ఇస్తే దేశీయంగ యువతకు ఉపాధి దక్కడమే గాకుండా, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కూడా దక్కుతాయి. లాక్ డౌన్ వేళ ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేస్తోన్న కేంద్రం మన వనరులను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై దార్శనికత కానరాలేదు.


అలాగే సమస్యలపై రాష్ట్రాలతో చర్చించే సామసం చేయలేదు. ఈ దశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించ బోయే నూతన వ్యవసాయ విధానానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే సిఎం కెసిఆర్ దార్శనికతను గమనించవచ్చు. సస్యవిప్లవం దిశగా తెలంగాణ వేస్తున్న అడుగులు శరవేగంగా పడుతున్నాయి.



తీసుకుంటున్న చర్యలు సాకారం అవుతున్న వేళ భవిష్యత్ లో తెలంగాణ వ్యవసాయకంగా పురోగమించడం కళ్లకు కనపడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల కోసం సీఎం కెసిఆర్ పడుతున్న తపన,జరగుతున్న పనులు చూస్తుంటే గోదావరి, కృష్ణమ్మ గలగలలు తెలంగాణ మెట్ట భూములను తడపడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇటీవల చేపట్టిన ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలాగే హరితహారంతో కోట్లాది మొక్కలు నాటారు. మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ పట్టింది. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు రాబోతున్నది. ఎవరుకూడా ఇష్టం వచ్చినట్లుగా వారికి అనుకూలమైన పంటలు వేయకుండా డిమాండ్ ఉన్న పంటలను పండించాలన్న లక్ష్యం మంచి నిర్ణయంగా స్వాగతించాలి.



అలా చేయని వారికి రైతుబంధు ఇవ్వబోమని కూడా చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి నిర్ణయం తెలంగాణకే కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. నిజానికి ఏ రాష్ట్రంలో ఎలాంటి వసతులు, వనరులు ఉన్నాయో గుర్తించి కేంద్రమే ఆయా పంటల విధానం తీసుకుని వచ్చి వాటిని మార్కెటింగ్ చేస్తే బాగుండేది.


కంపెనీల వెంటపడి వారికి కోట్ల రూపాయలు తగులబోసి కాలుష్యం కొనితెచ్చుకునే కన్నా వ్యవసాయాన్ని లాసాటి చేసే మార్గాలను అనుసరించాలి. అప్పులు లేకుండా సొంత పెట్టుబడితో తెలంగాణ రైతులు వ్యవసాయం చేసుకొనే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర రైతాంగానికి చేసిన సూచన అన్న్న రాష్ట్రాల రైతులకు వర్తిస్తుంది.



 


గుడ్డిగా అనుభవంలో ఉన్న పంటలతోనే నెగ్గుకు రావడం కన్నా వ్వయసాయంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి. సేంద్రియ వ్యవసాయానికి ప్రపంచం పట్టంకడుతున్న వేళ అలాంటి విధానాలను అవలంబించాలి. తెలంగాణ పంటలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయే పరిస్థితి రావాలన్న సిఎం కెసిఆర్ ఆకాంక్షలో ఓ లక్ష్యం దాగుంది.


శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసి రైతాంగం మంచి ఫలి తాలు సాధించాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు రైతులకు స్ఫూర్తిమంతం కావాలి. నిజానికి తెలంగాణలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యం మరెక్కాడా దక్కడం లేదు. నీటి వసతులతో పాటు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నారు.



అలాగే పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏటా పదివేలు అందిస్తున్నారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించారు. తెలంగాణ అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. విభిన్న రకాల నేలలు ఉండటం వల్లే ఇక్కడ అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ తన పరిశోధనలను కొనసాగిస్తోంది.


నల్లరేగడి, ఎర్ర, ఇసుక, తేలికపాటి, క్షార నేలలతోపాటు అనుకూలమైన వాతావరణ, పర్యావరణ, సమశీతోష్ణ వలయం ఉండటంతో అన్ని రకాల పంటలకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉంది. దీంతో పంటల ఉత్పత్తిలో తెలంగాణ అనేక రికార్డులను బద్దలు చేస్తోంది.



తుపానులు, ప్రకృతి వైపరీత్యాలు చాలా తక్కువ. ద్రాక్ష, మామిడి వంటి వాటిలో తెలంగాణకు ప్రత్యేకత ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. వివిధ రకాల పంటలతో దేశ, విదేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదుగుతోంది. ఇన్ని అవకాశాలు ఉన్న దశలో ప్రభుత్వం సూచించిన పంటలు పండించి రైతులు లాభాలు సాధించాలి.


ఈ ఏడాది నియంత్రిత విధానంలో పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలి. అందరూ ఒకే రకమైన పంట వేసి నష్టపోకుండా మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సాగు చేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సిఎం కెసిఆర్ స్వయంగా హామీ ఇచ్చారు. ఆ మేరకు కందిపంట వేస్తే తామే కొనుగోలు చేస్తామని ప్రకటించారు.



వరితోపాటు ప్రభుత్వం చెప్పిన పంటలు కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే రైతుబంధు పథకం రాదని సిఎం కెసిఆర్ కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి రైతుబంధు సదుపాయం పొందాలని కోరారు. అలాగే నియంత్రిత విధానంలో సాగు చేయించేలా రైతులకు అవగాహన కల్పించి రైతుబంధు ఇప్పించడంపై కలెక్టర్లు పోటాపోటీగా పనిచేయాలన్నారు.


రైతుబంధు పథకం కోసం ఇప్పటికే రూ. 2 వేల కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ మార్కెట్ కు తెలంగాణలో పండే ధాన్యం అమ్ముడుపోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో సన్న బియ్యానికి డిమాండ్ ఉంది. అంటే అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న పంటలను వేస్తూ లాభాలు ఆర్జిస్తే మంచిదని సిఎం కెసిఆర్ చేసిన సూచన దేశంలోని ప్రతి రైతుకు వర్తిస్తుంది.


ఇలా చేయడం వల్ల రైతులు ఆర్థికంగా బలపడగలరు. దేశంలో ఇలాంటి ఆలోచన రావడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాలి. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకం కాగలదనడంలో సందేహం లేదు.


Comments