పడకంటి మనసులో మాట 28.06.2020


పడకంటి మనసులో మాట .....


_____________________________________________________________


విద్యా వ్యవస్థలో ప్రక్షాళన అవసరం ఎంతైనా ఉంది. మానవ మనుగడలో కోవిడ్ ఎలా అయితే అనివార్యమైన మార్పు తీసుకు వచ్చిందో, అలాగే విద్యా బోధన నుంచి తరగతి గదుల వరకూ మార్పులు చోటు చేసుకోక తప్పని సరి. గతంలో లా అంతా ప్రైవేటుదే అని ప్రభుత్వ బోధనను నిర్లక్ష్యం చేయడానికి ఇసుమంతైనా అవకాశం లేదు. కోవిడ్ పరీక్షలు, చికిత్స విషయంలో సింహభాగం ప్రభుత్వాలే ఎలా బాధ్యత తీసుకున్నాయో, థమిక విద్య విషయంలో కూడా తీసుకోవలసిన అవసరం ఉంది. ఎల్ కేజీ నుంచే ఆన్ లైన్ బోధన అంటూ ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న హడావుడి ఫీజు'లుం' కోసమే తప్ప చిన్నారి వికాసం కోసం కాదని అందరికీ తెలుసు. విద్యా విధానంలో మార్పులపై మోడీ సర్కార్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


_____________________________________________________________


విద్యా విదానంలో మార్పులపై దృష్టి పెట్టాలి దేశంలో విద్య ప్రైవేటీకరణ ఆరంభమైనప్పటి నుంచి విద్యార్థులలో సృజనాత్మకతకు పాతర వేయడం ఆరంభమైంది. సహజమైన ఎదుగుదలకు అవకాశం లేకుండా బండెడు పుస్తకాలు, మెదడును నులిమేసే కోర్సులతో ఉద్యోగ, ఉపాధి వినా మరో ఆలోచనే లేదన్నట్లుగా మారిపోయింది. సువిశాల ప్రాంగణాలున్న పాఠశాలలు కనుమరుగయ్యాయి.


క్రీడలు, శారీరక, మానసిక వ్యాయామాలు లేకుండా రుబ్బుడు చదువులు వచ్చేశాయి. ఈ పరిస్థితి చిన్నారులలో అనేక మార్పులకు కారణమైంది. బాధ్యత, సామాజిక జీవనం, బంధాలు, అనుబంధాలకు వారిని దూరం చేసిందనే చెప్పాలి. ప్రధాని మోడీ తరచుగా చెప్పే భారత డీఎన్ఏ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది.విద్యా రంగ నిపుణులు ఈ తరహా విద్యా బోధన పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మార్కులు , గ్రేడ్ల పోటీ తప్ప మరో ప్రపంచమే లేదని విద్యార్థుల తల్లి దండ్రేలే మారిపోయే విధంగా కార్పొరేట్ విద్యా విధానం మార్చేసింది. అయితే కరోనా మహమ్మారి వచ్చి... అన్ని వ్యవస్థలనూ స్తంభింప చేసినట్లుగానే విద్యా రంగాన్ని స్తంభింప చేసేసింది.


గత నాలుగు నెలలుగా పిల్లలకు పాఠాలు లేవు. ఆల్ లైన్ క్లాసులంటూ హడావుడి జరుగుతున్నా అది ఇంకా వ్యవస్థీకృతం కాలేదు. షేక్ హ్యాండ్ కాదు...నమస్కారం మన సంస్కృతి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటించడం ద్వారానే కరోనాను తరిమి కొట్టగలం అంటూ ప్రదాని మోడీ పదే పదే చెబుతున్నారు.అలాగే ఆ సంస్కృతీ, సంప్రదాయాలను చిన్ననాటి నుంచీ బోధించే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. పునాదుల నుంచీ పటిష్టంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావలసిన అవసరం ఉంది.


సామాజిక దూరం పాటిస్తూనే... సహ విద్యార్థుల పట్ల స్నేహ భావం, పెద్దల పట్ల గౌరవం. చదువుల పోటీలో ఆరోగ్యకర వాతావరణం తిరిగి తీసుకురావలసిన అవసరం ఉంది. కార్పొరేట్ విద్యా విధానం కారణంగా పరీక్షల ఫలితాలు వస్తున్నాయంటేనే తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టే పరిస్థితి నెలకొంది. ఫలితాలు రావడం విద్యార్థుల ఆత్మహత్యల వార్తలతో పేపరు తెరవాలంటేనే భయం వేసే పరిస్థితి మారాలి.చదువు అంటే మార్కులు, ర్యాంకులే కాదు... సమాజాన్ని అర్ధం చేసుకుని, జీవన మార్గాన్ని సుందరంగా మలచుకునే జ్నానాన్ని సముపార్జించుకోవడం అని తెలిసే, తెలిపే విధంగా బోధన ఉండాలి. గతంలో గురు శిష్య సంబంధం అపురూపంగా ఉండేది.


అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఆ బంధం పూర్తిగా వ్యాపారాత్మకమైపోయింది. కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ మానవ జీవితంలో ఒక పెద్ద మార్పునకు బీజం పడింది. మహమ్మారి వైరస్ కు ఇప్పటికైతే వ్యాక్సిన్ లేదు కానీ సమీప భవిష్యత్ లో మహమ్మారి భయం నుంచి మానవాళిని బయటపడేసే వ్యాక్సిన్ వచ్చి తీరుతుంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు సఫలమౌతున్నాయి.మహమ్మారిపై యావత్ భారతా వని ఏకతాటిపైకి వచ్చి ఎలా పోరాడిందో... భవిష్యత్ ఆశాకిరణాలపై విద్యార్థులకు మెరుగైన, మానసిక పరిపక్వతనిచ్చే విధంగా ప్రాథమిక స్థాయి నుంచీ బోధన ఉండేలా విద్యా వ్యవస్థలోని రుగ్మతలను రూపుమాపే చర్యలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.


ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. భావి భారత పౌరులను తీర్చి దిద్దే బాధ్యత వ్యాపార విద్యా సంస్థలకు అప్పగించేసి చేతులు దులిపేసుకునే పరిస్థితి మారాలి. ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అవసరమైతే చట్టాలలో మార్పు తీసుకురావాలి. చదువు సంపన్నులకే పరిమితమైపోయే విలాస వస్తువుగా మారిపోవడాన్ని సహించకూడదు.మోడీ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆన్ లైన్ క్లాసులంటూ ప్రైమరీ తరగతుల విద్యార్థులను సైతం ఫోన్లు, ల్యాప్ టాప్ లకు అతుక్కుపోయేలా చేయడం ఎంత వరకూ సమంజసమన్నది మోడీ ఆలోచించాలి. స్మార్ట్ పోన్ల విపరీత వినియోగం మానసిక ఎదుగుదలకు ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.


పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. టిక్ టాక్, పట్టీ వంటి వాటి వల్ల యువత, విద్యార్థులలో పెడధోరణలు ప్రబలుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి రాకుండా కేంద్రం కఠిన నిబంధనలు తీసుకురావలసి ఉంటుంది.సామాజిక దూరం పాటిస్తూనే పిల్లలు సమాజంలో, సమూహంలో ఉన్నతంగా ఎదిగి ముందుకు సాగేందుకు అవసరమైన విదానాలను తీసుకురావలసిన అవసరం ఉంది. పిల్లలు శారీకరంగానే కాదు మానసికంగా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే విద్యా విధానానికి రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది.


ఆ దిశగా కేంద్రం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. యోగాకు మోడీ ఎలా అయితే అంతర్జాతీయ గౌరవాన్ని గుర్తింపునూ తీసుకువచ్చారో అలాగే భారతీయ సంప్రదాయ విద్యా వ్యవస్థను పునరుద్దరించి ప్రపంచానికి ఆదర్శంగా నిలపే విధంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.


______________________________________________


ఆంధ్రలో సంక్షేమ రథం పరుగులు ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా... ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ రథాన్ని ముఖ్యమంత్రి జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. నవరత్నాల పేరిట తన ఎన్నికలు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తూ ప్రజా మన్ననలు పొందుతున్నారు.


తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా అయితే అన్ని వర్గాల వారికీ ఏదో ఒక మేలు చేయాలన్న తపనతో పథకాలు ప్రవేశపెట్టారో... తనయుడిగా జగన్ కూడా అదే ఒరవడితో ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం ముంగిటకు వచ్చే విధంగా పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు లబ్దిదారునికి చేరుతున్నాయి.మధ్య వర్తులు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలలో సంతృప్తి స్థాయి పెరిగేలా పాలన సాగిస్తున్నారు. అయితే ఏపీకి మాత్రమే ప్రత్యేక మైన కుల రాజకీయాల కారణంగా జగన్ సంక్షేమ పథకాల విషయంలో విపక్షం చేస్తున్న విమర్శలకూ కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.


సంక్షేమం పేరిట అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సంక్షేమ పథకాలకు లభిస్తున్న ప్రచారం అభివృద్ధి కార్యక్రమాలకు లభించనం దువల్లనే ఈ విమర్శలకు అవకాశం కలుగుతోంది.ఇటీవల ప్రాజెక్టులపై సమీక్షలో నవంబర్ నాటికి పోలవరం గేట్లు బిగించాలన్న జగన్ ఆదేశాలను గమనిస్తే అభివృద్ధి పనులు ఎక్కడ కుంటుపడ్డాయన్న ప్రశ్న తలెత్తక మానదు. రాష్ట్ర పాలనా బాధ్యతకు సారథ్యం వహిస్తున్న నేతగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెంటిని ముందుకు తీసుకువెళ్లడంలో జగన్ ఒక విధంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారనే చెప్పాలి.


అన్నిటికీ మించి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా కష్ట కాలంలో వలస కూలీలను ఆదుకోవడానికి జగన్ ముందుకు వచ్చారు. శ్రామిక రైళ్లలో వారిని స్వరాష్ట్రాలకు తరలించడమే కాకుండా ఇతర రాష్ట్రాలలో చిక్కుకు పోయిన వారిని స్వరాష్ట్రానికి రప్పించడంలోనూ జగన్ ఇతర రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచారు.క్వారంటైన్ లో ఉన్న వారికి, కోవిడ్ బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించి అమలు చేయడం ద్వారా, వారికి పౌష్టికా హారం తీసుకుని పూర్వ శక్తిని ఆరోగ్యాన్ని పొందేం దుకు అవకాశం లబించేందు కుదోహ దపడ్డారు.


రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు విషయం లోనే జగన్ ఒకింత సంయమనం పాటించాల్సి ఉంది.


______________________________________________


తెలుగు రీవి పీవీకి కేసీఆర్ సముచిత గౌరవం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను విశ్వ వ్యాప్తంగా నిర్వహించాలని తలపెట్టడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సముచిత నిర్ణయం తీసుకున్నారు.


దివాళా స్థితి నుంచి దేశ ఆర్థిక రథాన్ని గాడిన పెట్టి అంతర్జాతీయంగా తిరుగులేని స్థితికి చేరడానికి పీవీ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణమనడంలో సందేహం లేదు. పీవీ నరసింహరావు ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది.ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి అప్పటికి మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న పీవీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాదు పరుగులు పెట్టించారు. జీవితమంతా కాంగ్రెస్ పార్టీకే సేవ చేసిన తెలుగు బిడ్డకు ఆ పార్టీ కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకపోవడమేక ఆదు... ఆయన ఘనతను చెరిపేసే ప్రయత్నం కూడా చేసింది.


ఆపద్దర్మ ప్రధానిగా నెల రోజులు పని చేసిన వారికే హస్తినలో స్మారకాలను నిర్మించిన కాంగ్రెస్ పీవీ నరసింహరావు భౌతిక కాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయంలోనికి కూడా అనుమతించకుండా మన అవమానం పాలు చేసింది. ఆ అవమానం పీవీకి మాత్రమే కాదు.యావత్ జాతికీ జరిగింది. తెలుగు జాతికి జరిగింది. హస్తినలో అంత్యక్రియలు జరిపేందుకూ అవకాశం ఇవ్వని నాటి కాంగ్రెస్ పెద్దలు అమానవీయంగా వ్యవహరించారు. నిజమైన భారత రత్నాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు...పీవీ ఘనతను విశ్వ వ్యాప్తంగా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా కార్యాచరణకు శ్రాకారం చుట్టడం బహుదా ప్రశంసనీయం.మనిషి ఔన్నత్యాన్ని గుర్తించడానికి పార్టీల అడ్డుగోడలు ఉండవని కేసీఆర్ చాటారు. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో భారతదేశ చరిత్రలో ఏ నాయకుడికీ జరగని విధంగా.. అత్యున్నత గౌరవం దక్కేలా, తెలంగాణ భూమి పుత్రుడి స్మరణ కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు.ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక ప్రభుత్వ పథకానికి పీవీ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. వీవీ శత జయంతి ఉత్సవాల ఆరంభ కార్యక్రమంలో కేసీఆర్ స్వయంగా పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా 50దేశాల్లో ఉన్న తెలంగాణ ఎ ఠలతో వీడియో సమావేశం ద్వారా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.


పీవీశతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలను కూడా మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. పీవీకి ఒడిస్సాతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలతో, అక్కడి నేతలతో ప్రత్యేక అనుబంధం ఉండగా.. ఆయా ప్రాంతాల్లో శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి.ఇక పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రతిని స్వయంగా తానే ప్రధానికి అందజేస్తానని కేసీఆర్ ప్రకటించడం ద్వారా తెలుగు ఠీవీ పీవీ స్మృతికి నిజమైన నివాళులర్పించినట్లైంది.


______________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


 


Comments