కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆగని బియ్యం దందా
వరంగల్ : రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పందికొక్కుల్లా పంచుకు తింటున్నారు. అక్రమాలను అరికట్టాలని బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ దందా ఆగడం లేదు. రాష్ట్రప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా రేషన్ దందా ఆగడం లేదు.
రూపాయి కిలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నారు. కొంతమంది అధికారుల నుంచి దందాకు మద్దతు ఉండడంతో వారి చెప్పుచేతల్లోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. తెర వెనుకవారి మద్దతు ఉండడంతో ఈ వ్యవహారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నచందంగా సాగుతున్నది.
మాఫియా ఆగడాలను అరికట్టాలని చూసిన ఓ ఎస్సైకి చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళల్లో లారీలో లోడ్ చేస్తున్నారనే సమాచారంతో వెళ్లిన ఓ అధికారికి పోస్టింగ్ ఊడిపోయేలా చేశారంటే అక్రమార్కులు ఏస్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు.
రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యాన్ని రీ సైక్లింగ్ కు పంపిస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. రాత్రికి రాత్రి సంచులకొద్దీ బియ్యాన్ని మాయం చేసి జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నిరుపేదల కడుపు నింపాల్సిన చౌకబియ్యం దొడ్డి దారిన చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఉమ్మడి జిల్లాలో పలు కీలకమైన ప్రాంతాలు కేంద్రాలుగా చౌక బియ్యం దందా కొనసాగుతోంది. నర్సంపేట డివిజన్ లోని చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల కేంద్రంగా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దందాను నడుపుతున్నారు. పరకాల ప్రాంతంలో పేరుమోసిన వ్యాపారి సైతం బియ్యం దందా చేస్తున్నట్టు తెలిసింది.
నర్సంపేట పట్టణంలోని పలు షాపుల నుంచి రేషన్ బియ్యం దొడ్డిదారిన అక్రమార్కుల గోదాంలకు చేరుతున్నాయి. కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి సన్న బియ్యంగా మార్చి . మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రామాల్లో దళారులు ఇంటింటా కిలోకు రూ. 5నుంచి రూ.10లకు కొనుగోలు చేసి కిలోకు రూ.15 కోళ్ల దాణా కోసం ఫారాలకు, రాజస్థాన్, మహారాష్ట్ర ముంబాయి రాష్ట్రాలకు సరఫరా చేసి లాభాలు పొందుతున్నారు. లబ్దిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యాన్ని దళారులు నిల్వ చేసి పెద్ద మొత్తంలో బియ్యం పోగయ్యాక లారీలు, డీసీఎంల ద్వారా పొరుగు రాష్ట్రాలకు కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గతంలో రేషన్ దుకాణాల్లోకి వచ్చిన బియ్యాన్ని దళారులు రైస్ మిల్లులకు సరఫరా చేసేవారు. వాటిని సేకరించిన మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) తిరిగి సరఫరా చేసి లాభాలు గడించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొసైటీలు, ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించి, లెక్కప్రకారం మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోళ్లు చేస్తుంది.
దీంతో అదనంగా బియ్యం సరఫరా చేయలేని పరిస్థితి మిల్లర్లకు ఏర్పడింది. మిల్లర్లు సైతం రేషన్ బియ్యం కొనుగోలును తగ్గించారు. రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలించే వారిపై పీడీ చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కఠిన చట్టాలున్నా కూడా అక్రమార్కులు దందాను వీడడం లేదు. కొందరు అధికారులు అండగా ఉండడంతో వారికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఏ సమయంలో తరలించాలో, ఎలా తరలించాలో అనే అంశాలను సైతం అక్రమార్కులకు నిఘా అధికారులే గైడెన్సు ఇస్తుండడంతో మాఫియా జోరు నడుస్తోంది.