పడకంటి మనసులో మాట 21.06.2020

పడకంటి మనసులో మాట.....


 _____________________________________________


చైనా పీచమణచాల్సిందే. ఆ దేశందూకుడుకు, దురాక్రమణ తీరుకు గట్టిగుణపాఠం చెప్పాల్సిందే. ప్రధానిగా మోడీ అదే నిర్ణయాన్ని అఖిలపక్షంలో చెప్పారు. పార్టీలు వేరైనా, సిద్ధాంత విభేదాలున్నా, దేశ రక్షణ విషయంలో అంతా ఒక్కటే అన్నస్ఫూర్తి మరోసారి వెల్లి విరిసింది.


ఆసేతు హిమాచలం డ్రాగన్ తీరును తప్పుపడుతున్నాయి. చైనాను నిలువరించే విషయంలో కేంద్ర ప్రభత్వానికి, మోడీకి బాసటగా ఉంటామని ముక్త కంఠంతో చెబుతున్నారు. భారత సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో దేశం అంతా ఒకే మాట, ఒకే బాట అన్న భావన దేశ వ్యాప్తంగా వ్యక్తమౌతున్నాయి.


గల్వాన్ ఘటన పట్ల భారత్ సత్యాగ్రహానికి, ధర్మాగ్రహానికి ప్రపంచం కూడా మద్దతుగా నిలుస్తున్నది.


 _____________________________________________


చైనాను నిలువరిద్దాం 



ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తుంటే... ఆ మహమ్మారి వ్యాప్తికి కారణమైన చైనా మాత్రం దురాక్రమణకు కుట్రలు చేస్తున్నది. చైనాపై ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకత భారత్ పై సానుకూలంగా మారడంతో కడుపుమండిన డ్రాగన్ భారత భూ భాగంలోనికి చొచ్చుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నది.


గల్వాన్ లోయలో భారత జవాన్లను ఒక ప్రణాళిక మేరకు రెచ్చగొట్టి, వ్యూహాత్మకంగా వారిపై దాడి చేసింది. ఆ దాడిని దీటుగా భారతజవాన్లు ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో 20 మంది అమరులయ్యారు. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.



సైన్యాధ్యక్షుల స్థాయిలో చర్చలు జరిగినా, ఒప్పందాలు కుదిరినా చైనా కుత్సితం, కుతంత్రం మారలేదు. ఈ నేపథ్యంలోనే ఎల్ఓసీ వద్ద ఇరు దేశాల సేనలూ మోహరించడంతో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ లో చైనా వ్యతిరేకత పెచ్చరిల్లి ఆదేశ వస్తువుల బహిష్కరణ ఉద్యమం జోరందుకుంది.


ఈ నేపథ్యంలోనే భారత జవాన్లకు అండగా నిలుద్దామంటూ పిలుపునిచ్చిన ప్రధాని చైనా విషయంలో అనుసరించాల్సిన తీరు, వ్యూహంపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో ఏకపక్ష నిర్ణయాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించిన మోడీ తీరు అభినందనీయం.



మోడీ విధానాలపై విమర్శలు గుప్పించే నేతలు కూడా చైనాను నిలువరించే విషయంలో కేంద్రానికి అండగా నిలబడతామంటూ ముక్తకంఠంతో మద్దతు ప్రకటించడంతో భారత్ బలం మరోసారి రుజువైంది. నిజమే... ప్రధానిగా మోడీ ఆర్థిక విధానాలపై ఎన్డీయేలో సైతం భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.


దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి ఈ విధానాలు దోహదపడవన్న భావన పలువురిలో ఉంది. ఈ విషయాన్ని వారంతా గత ఆరేళ్లుగా చెబుతూనే వస్తున్నారు. అయితే అంశాల వారీ విభేదాలను ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైన విషయంగానే భావించాల్సి ఉంటుంది.



అయితే దేశ రక్షణ విషయానికి వచ్చే సరికి రాజకీయాలతో సంబంధం లేకుండా దేశం అంతా, పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిలబడటమన్నది భారత్ సొంతమైన ప్రత్యేకత. ఈ ఐకమత్యమే, ఈ సంఘీ భావమే గతంలో చైనాతో యుద్ధంలో కూడా భారత ఔన్నత్యాన్ని, భారత్ డీఎన్ఏలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటింది.


ప్రస్తుతం కూడా మోడీ నాయకత్వ పటిమ, అందరినీ కలుపుకుపోవాలన్న భావనే చైనా పై భారత జాతి ముక్తకంఠంతో ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడానికి వీలు కల్పించింది. ఇదే కాదు, చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలోనూ మోడీ దౌత్య విలక్షణత ఎంతగానో దోహదపడింది.



చైనా వ్యతిరేకత వీగిపోయి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి ప్రపంచ దేశాలు మద్దతు పలకడమే ఇందుకు నిదర్శనం.


________________________________


కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం పరుగులు 



కరోనా కష్టకాలంలోనూ ఏపీలో సంక్షేమం పరుగులు తీస్తున్నది. నవరత్నాల పేరిట జగన్ ఎన్నికల | మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వరుసగా నెరవేరుస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ బడ్జెట్ లో కూడా సంక్షేమానికి పెద్ద పీట వేశారు.


| ఇందు కోసం వ్యవసాయానికి గతం కంటే కేటాయింపులు తగ్గించేందుకు కూడా వెనుకాడలేదంటే, సంక్షేమంపై జగన్ సర్కార్ ఎంత శ్రద్ధ కనబరుస్తున్నదో అవగతమౌతుంది. అదే సమయంలో జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నది.



అయితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మాత్రం సరిగా లేదనే చెప్పాలి. చేసిన అభివృద్ధి, అమలు అవుతున్న సంక్షేమ పథకాల కంటే రాష్ట్రంలో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యల పైనే ప్రజలలో ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఇందుకు రాష్ట్రంలో వరుసగా సంభవిస్తున్న పరిణామాలే కారణం.


ఈస్ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన విధానం, అలాగే అయ్యన్న పాత్రుడి పై నిర్భయ కేసు నమోదు చేయడం వంటివి ప్రభుత్వం పారదర్శకతకు తిలోదకా లిచ్చేసిందన్న అనుమానాలకు తావిస్తున్నాయి.



ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు, తాను బ్రేక్ ఫాస్ట్ చేసి, మందులు వేసుకువస్తానని చెప్పినా అంగీకరించకుండా అదుపులోనికి తీసుకోవడం ఏ విధంగా సముచితం కాదు. అలాగే పోలీసులు ఆయన ఇంటి గోడ దూకి వెళ్లాల్సిన అవసరం ఏమిటో కూడా అర్ధం కాదు.


ఇక మండలిలో జరిగిన పరిణామాలు చూస్తే ఇరు పార్టీల నేతలు కూడా చట్ట సభ సభ్యులుగా కాకుండా వీధి గుంపుల్లో వ్యక్తుల్లా వ్యవహరించారు. దేశ చరిత్రలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం లబించకుండా సభ వాయిదా పడటం ఇదే తొలిసారి.



అ చెత్త రికార్డుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడానికి అధికార వైకాపా, విపక్ష తెలుగుదేశం పార్టీలూ, వాటి నాయకులే బాధ్యులు అనడంలో సందేహం లేదు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత కక్షల స్థాయికి మారిపోయాయా అనే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కనిపిస్తున్నది.


గతంలో ఇటువంటి పరిస్థితి తమిళనాడు రాజకీయాలలో కనిపించేదు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు తమిళనాడును మించిపోయాయి. రాజకీయ మర్యాదలూ, విలువలకు తిలోదకాలిచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. జగన్ ఈ పరిస్థితిని సరిదిద్దాల్సి ఉంది.


________________________________


కెసిఆర్ దార్శనికతే రాష్ట్రానికి శ్రీరామరక్ష 



కేసీఆర్ దార్శనికతకు మరో తాజా ఉదాహరణ గల్వాన్ ఘటనపై మోడీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఆయన ప్రసంగం. దేశ రక్షణ, దేశ భద్రత విషయంలో రాజీకీ, రాజకీయ విభేదాలకూ తావే లేదని నిష్కర్షగా, నిర్వంద్వంగా ఆయన ప్రకటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.


అఖిలపక్షంలో కేసీఆర్ సూచనలకు అన్ని పార్టీల నుంచీ హర్షామోదాలు వ్యక్తం కావడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మోడీతో కేసీఆర్ విభేదించినంత తీవ్రంగా మరో ప్రాంతీయ పార్టీ అధినేతా విభేదించలేదు.



కరోనా లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు, ఆదాయం కోల్పోయిన రాఎలను ఆదుకోవడానికి కేసీఆర్ చేసిన హెలీకాపర్ మనీ సూచనను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ స్వాగతించాయి.


అలాగే మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలోని డొల్ల తనాన్ని, అంకెల గారడీని మొట్టమొదట చెప్పినది తెరాస అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. ఆ తరువాతే కాంగ్రెస్ ప్యాకేజీని వ్యతిరేకించింది.



కేసీఆర్ విమర్శలలోని ప్రతి అంశాన్ని కాంగ్రెస్ సమర్థించింది. జాతీయ స్థాయిలో కేసీఆర్ విధానాలు, పథకాల పట్ల ఆసక్తి కనబడుతోంది. చాలా రాష్ట్రాలు, వాటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయి) తెలంగాణ పథకాలను తమ రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాయి.


అందు కోసం ఆయా రాష్ట్రాల ప్రతినిధి బృందాలు తెలంగాణలో పర్యటించాయి కూడా. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు సందర్భాలలో రైతు బంధు పథకంపై ప్రశంసల వర్షం కురిపించారు. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలకు పదును పెడుతున్నారు.



ఆరేళ్ల పాలనలో తెలంగాణ ఆగమాగం అయ్యిందనీ, ఉద్యమ ఆకాంక్షలు పట్టించుకోవడం లేదనీ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రాజకీయ విమర్శలకు ఇది అనువైన సమయం కాదు. ఒక వైపు కరోనా ముప్పు, మరో వైపు చైనాతో యుద్ధ వాతావరణం.


ఈ తరుణంలో రాజకీయ విభేదాలకు తావు లేకుండా, అసలు రాజకీయ కార్యక్రమాలకు అవకాశమే లేకుండా దేశ రక్షణ, కరోనా నివారణ అంశాలలో అన్ని పార్టీలూ ఏకతాటిపైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



కరోనా కట్టడి విషయంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి కట్టడికి సాధ్యమైనన్ని ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడమే మార్గమని అంతా భావిస్తున్నారు.


కేంద్రమూ, ప్రపంచ ఆరోగ్య సంస్థా అదే చెబుతున్నది. ఈ విషయంలో తెలంగాణ వెనుకబాటుకు కారణాలేమిటన్నది కేసీఆర్ పరిశీలించాల్సిన అవసరం ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో కేంద్రం విదానమే గందరగోళంగా ఉంది.



లక్షణాలు లేని వారికి పరీక్షలు వద్దని చెబుతూనే సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటూ రాష్ట్రాలకు సూచనలు ఇస్తోంది. అదే దేశంలో కరోనా పరీక్షల విషయంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో తీరుగా మారడానికి కారణం. కరోనా మహమ్మారి వ్యాప్తి అన్నది ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో పరిమితమైన అంశం ఎంత మాత్రం కాదు.


దీనికి ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో ప్రకటించేసింది. కరోనా కట్టడి విషయంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో తీరుగా ఉండటం వల్లనే మహమ్మారి వ్యాప్తి అదుపులేకుండా సాగుతోంది. దీని కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కఠిన నిబంధనలను తెరమీదకు తీసుకురావలసిన అవసరం ఉంది.



ఈ కల్లోల సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించిన ప్రత్యేక అధికారాలను పూర్తిగా వినియోగించుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా రాష్ట్రాలకు వస్తున్న ఇబ్బందులను అధిగమించే విషయంలో కేంద్రం రాష్ట్రాలకు అన్ని విధాలుగా అండదండలు అందించాల్సిన అవసరం ఉంది.


ఆ బాధ్వత నుంచి వైదొలగి కేంద్రం ప్రజలే ఎవరి రక్షణ వాళ్లు చూసుకోవాలనడం, రాష్ట్రాలే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కరోనా కట్టడి చర్యలు తీసుకోవాలనడం బాద్యత నుంచి తప్పుకోవడమే అవుతుంది. ఇదే విషయం కేసీఆర్ పలు సందర్భాలలో కేంద్రానికి తెలిపారు.


బతికుంటే బలుసాకు తిని బతుకుదాం. ఆర్థిక కోణంలో కరోనా కట్టడి చర్యలను విరమించవద్దని కేసీఆర్ అంటున్నారు.


________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


Comments