వ్యవసాయరంగ అభివృద్ధితోనే భారతదేశం పురోగమిస్తుంద


 


వ్యవసాయరంగ అభివృద్ధితోనే భారతదేశం పురోగమిస్తుందన్నది పాలకులు గుర్తించాలి. రైతులను రారాజులుగా చేస్తేనే దేశ ఆర్థికవ్యవస్థ గాడిలో పడుతుంది. వ్యవసాయాన్ని , అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకుంటే తప్ప మనుగడ సాధ్యం కాదు.


భారతదేశం ప్రధానంగా వ్యవసాయక దేశం. దీనిని గుర్తించి వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. రైతులు వ్యవసాయాం మానేస్తే మనగతేంటన్నది పాలకులు ఊహించు కోవాలి. అందుకే తెలంగాణ, ఆంధ్రా సిఎంలు రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంతో పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.అలాగే రైతులకు జీవిత బీమా చేయిస్తున్నారు. ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు పెద్దపీట వేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో ధాన్యం దిగుబడులు పెరిగాయి. వారిని రాజులు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించిన సిఎం కెసిఆర్ ఆ దిశగానే సాగుతున్నారు.


అలాగే ఎపిలో కూడా రైతుభరోసా కార్యక్రమం చేపట్టడం ముదావహం. దీంతో రైతులకు ఆపన్నహస్తం దక్కినట్లు అయ్యింది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కారణంగా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. సకాలంలో రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థ ఇంతవరకు లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇదో సంస్కరణగానే చూడాలి. అయితే దేశవ్యాప్తంగా ఈ మార్పు రావాలి. రైతులు పండించిన పంటలకు వారే ధరలు నిర్ణయించి అమ్ముకునే పరిస్థితి రావాలి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చి, పంట ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పించాలి. అప్పుడే మన వ్యవసాయానికి గిట్టుబాబు కాగలదు.


లాక్ డౌన్నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన పలు పథకాలు రానున్న ర ఓజుల్లో వ్యవసాయానికి ఊతం ఇచ్చేలా ఉన్నాయి. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ తో పాటు, పాడి, మత్స్య పరిశ్రమలకు పెద్దపీట వేయబోతున్న తీరు మార్పుకు చిహ్నంగా చూడాలి.మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .... వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, రైతుల ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలకు ఈ నిధితో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్లతో కూడిన ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించి మూడో విడుతలో ప్రధానంగా వ్వయసాయ,పాడి, మత్స్య పరిశ్రమలకు పెద్దపీట వేవారు. వ్యవసాయం, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, మత్స్యశాఖ, పశు సంవర్థక రంగాలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టారు. రైతులకు మెరుగైన ధరల ప్రయోజనం చేకూర్చేలా నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తామన్నారు.పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవసాయ రంగాన్ని పోటీగా మార్చడం, మెరుగైన ధరల ప్రయోజనం కల్పించడం వంటి లక్ష్యాలను ప్రకటించారు. వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను చట్టం బయటకు తీసుకొస్తున్నట్లు చెప్పడం మంచి పరిణామం.


ఆహార శుద్ధి విభాగంలోని పరిశ్రమలకు సరకు నిల్వ పరిమితి నుంచి మినహాయింపులు ఇస్తామని, ఈమేరకు నిత్యవసరాల చట్టానికి సవరణలు తెచ్చేందు కు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇకపోతే ప్రధానమైనది మార్కెటింగ్ సదుపాయం. ఇంతకాలం రైతులు ఎక్కడపడితే అక్కడ ధాన్యం లేదా ఉత్పత్తులను అమ్ముకునే వెసలుబాటు లేదు.అయితే తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతులకు మార్కెటింగ్ ఎంపిక ఇచ్చేందుకు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు చేపడుతున్నామని, అందుకోసం చట్టం తీసుకొస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. అంతర్ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై పరిమితులను తొలగిస్తామని చేసిన ప్రకటన వారికి ఊరట కలిగించేదే.


దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో లైసెన్స్ రాజ్ కు అడ్డుకట్ట వేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ మంచిధర వస్తే అక్కడే తమ పంటలు అమ్ముకోవచ్చన్న హామీ ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి ఈ-ట్రేడ్ విధానం బలోపేతం చేస్తామని చెప్పారు.ప్రతి సీజన్ కు ముందే ఏ పంట ఎంతకు కొంటారో చెప్పేలా చట్టపరమైన ఏర్పాటు చేస్తామన్నారు. నిజంగా ఇవన్నీ వినడానఇకి బాగానే ఉన్నా అమల్లో కృషి జరగాలి. ఎందుకంటే ఈ-నామ్ ప్రవేశ పెట్టిన తరవాత ఇప్పటి వరకు దానితో ఎక్కడా లాభం జరిగినట్లు దాఖలాలు కానరాలేదు. సరికదా దళారులు కుమ్మక్కయి ఈనామ్ కు గండి పెట్టారు.


ఇకపోతే దేశ వ్యాప్తంగా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి సీతారామన్ తెలిపారు. మహిళల కేంద్రంగా ఈ కేటాయింపుల వినియోగం ఉంటుందని, దేశ వ్యాప్తంగా సుమారు రెండు లక్షల సూక్ష్మ, చిన్న సంస్థలకు దీంతో ప్రయోజనం కలుగు తుందని తెలిపారు.ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద రూ. 20 వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. శీతల గోదాములు, మార్కెట్ల కోసం రూ. 9 వేల కోట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. అమ్ముకునే అవకాశాలు రావడం లేదు. ఈ దశలో కోల్డ్ స్టోరేజీల అవసరాన్ని గుర్తించారు.


అదే సమయంలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్ కు పెద్దగా స్పందించలేదు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం, అమ్మకాలకు తోడ్పాటు నందించడం వంటి సమస్యలు నిరంతరా యంగా ఉన్నాయి. వీటిని అధిగమించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. రైతులకు వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేయాలి.అప్పుడే ఎన్ని ప్రకటనలు చేసినా లాభం ఉంటుంది. వెంటనే వ్యవసాయ రంగం బలోపతేం చేసి, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే దిశగా అడుగులు పడాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం చేరుకోగలం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రకటించిన రంగాలుపరుగులు పెట్టేలా కార్యాచరణ చేస్తే తప్ప ఫలితాలు రావని కేంద్రప్రభుత్వం గుర్తించాలి.


Comments